లగ్జరీ కారును గాడిదకు కట్టి షోరూంకు తీసుకెళ్లిన యజమాని.. వీడియో వైరల్‌

-

ఏదైనా వస్తువును ఆశపడి కొన్నప్పుడు.. అది ఇంటికి తెచ్చి నెల కూడా తిరగక ముందే చెడిపోతే ఎంత బాధ ఉంటుందో కదా..! చాలా మందికి కారు కొనాలనే కోరిక ఉంటంది.. దానికోసం.. ప్రతిక్షణం ఆలోచిస్తారు. అలాగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ కూడా.. అక్షరాల 17.5 లక్షలు పెట్టి క్రెటా కారును కొన్నాడు. కారును షోరూం నుంచి తెచ్చిన నెల రోజులకు అది మొరాయించింది. పదే పదే స్టార్టింగ్ సమస్య రావడంతో షోరూం వాళ్లకు సమాచారం ఇచ్చాడు. సమస్య ఏంటో చూడమని కంప్లైంట్ చేస్తే ..ఎవరూ స్పందించకపోవడంతో ఎలాగైనా షోరూం నిర్వహకులకు బుద్ధి చెప్పాలని ఆగిపోయిన కారుకు తాడు కట్టి దాన్ని ఓ గాడిదతో షోరూం వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

యజమానికి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎలాగైనా కార్ షోరూం డీలర్‌కి తెలియజేయాలనుకున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని మద్రు పారిశ్రామిక ప్రాంతంలోని కారు షోరూంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం 17.5 లక్షలు చెల్లించి క్రెటా కారును కొనుగోలు చేశాడు. అయితే ఆ కారుకి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కూడా రాకముందే స్టార్టింగ్ ప్రాబ్లమ్ రావడంతో డీలర్‌ను సంప్రదించాడు. అయితే కారు షోరూం నుంచి వచ్చిన మెకానిక్‌లు రాజ్‌కుమార్‌ కారు సమస్యను తాత్కాలికంగా పరిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కారును తీసుకొని వివాహానికి వెళ్లాడు. అక్కడ కూడా కారు మొరాయించింది.

కొత్త కారు పదే పదే మొరాయించడంతో రాజ్‌కుమార్‌ ఎలాగైనా కారు డీలర్‌కి బుద్ధి చెప్పాలని ఆగిపోయిన కారుకు తాడు కట్టి దాన్ని గాడిదతో లాగించుకుంటూ షోరూం వరకు తీసుకెళ్లాడు. గాడిద కారును లాక్కుంటూ రోడ్డుపై వెళ్తున్న దృశ్యం చూసిన వాళ్లంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అయింది.

కొత్తగా కొనుగోలు చేసిన కారును సర్వీస్‌ సెంటర్‌కి తీసుకొచ్చినప్పటికీ కారులోని సాంకేతిక లోపాన్ని గుర్తించలేదని ..అసలు కారు ఎందుకు పదే పదే ఆగిపోతుందో కనుగొనలేకపోయారని షోరూం నిర్వాహకులపై రాజ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి తీసుకెళ్తే కారును స్టార్ట్ చేయడానికి రెండు సార్లు నెట్టాల్సి వచ్చిందన్నాడు. అయితే సర్వీస్‌ సెంటర్‌లో ప్రాబ్లమ్ చెబితే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిందని..రీచార్జ్ అవడానికి కారును నడపమని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గాడిదతో లాక్కొచ్చిన కారును షోరూంలోనే వదిలేసి ప్రత్యామ్నాయం చూపించమని డిమాండ్ చేశాడు కారు యజమాని రాజ్‌కుమార్.

కంపెనీ ఏం అంటోంది..

కారును చెక్‌ చేయడానికి వచ్చిన కంపెనీ ప్రతినిధి కారు యజమని పొరపాటు వల్లే విద్యుత్‌ ప్రాబ్లమ్ వచ్చి స్టార్ట్ కావడం లేదని తేల్చి చెప్పారు. అయితే కారు యజమాని రాజ్‌కుమార్ మాత్రం తన కారును షోరూంలో వదిలిపెట్టి కొత్త కారును ఇస్తేనే తీసుకెళ్తానంటూ డిమాండ్ చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version