కారు ఇప్పుడు అవసరంగా మారిపోయింది. ఒకప్పుడు బాగా డబ్బున్న వారి ఇళ్ళలో మాత్రమే ఉండే కారు ఇప్పుడు మధ్యతరగతి జీవితాల్లోకి వచ్చేసింది. కారు కొనుక్కోవడం ఒకప్పుడు కలగా ఉండేది. ఇప్పుడు పెద్దగా కలలు కనకుండానే కారు కొనేస్తున్నారు. కారులో తిరుగుతున్న ఫీలింగ్ నిజంగా బాగానే ఉంటుంది. ఇంట్లో కూర్చున్నట్టుగానే కార్లోనూ చాలా ఫ్రీ గా ఉంటాం. కానీ నడుస్తున్న కారులో కూర్చుని కొన్ని విషయాలు చేయకూడదు. తినడం నుండి శృంగారం వరకు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
డాష్ బోర్డ్ మీద కాళ్ళు పెట్టకూడదు
కారు వేగంగా పోతున్నపుడు డ్రైవర్ సీటు పక్కన ప్రయాణీకులు డాష్ బోర్డ్ మీద కాళ్ళు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా ప్రయాణం చేసినపుడు ఏదైనా జరగరానిది జరిగితే గనక కాళ్ళు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. రోడ్డు మీద ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఇలాంటి ఫీట్లు చేయకపోవడమే ఉత్తమం.
అనవసరమైన వస్తువులన్నీ కార్లో పెట్టవద్దు
ఇంట్లో ఉన్నట్లుగానే కార్లో ఉంటానంటే కుదరదు. కొందరు వెనక సీట్లో నిండుగా సామాన్లు పెట్టేస్తుంటారు. అది అస్సలు కరెక్ట్ కాదు. వెనకాల ఏమొస్తుందో తెలియకుండా ప్రయాణం చేయవద్దు. ఒక్కరోజుకీ ఏమవుతుందిలే అన్న ఆలోచనలే ఇబ్బందులకి గురి చేస్తాయి.
హెడ్ ఫోన్స్
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూదన్న నియమాలు అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఇదో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకోవడం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు విన్నా, మాటలు మాట్లాడినా దృష్టంతా తప్పిపోతుంది. అవతలి వారు చెప్పేది అంత త్వరగా చెవికెక్కదు.
కారు అద్దాలు కిందకి దించి విపరీతమైన సౌండుతో సంగీతం పెట్టడం, కార్లో శృంగారం మొదలైనవన్నీ చేయకుండా ఉంటే ఇంటికి సురక్షితంగా చేరుకోగలరు.