ఆవు లేకుండానే పాలు.. ఇజ్రాయెల్ స్టార్ట‌ప్ ఘ‌న‌త‌..!

ఆవు పాల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆవు పాల‌లో కొవ్వు ప‌దార్థాలు త‌క్కువ‌గా ఉంటాయి క‌నుక గుండె జ‌బ్బులు ఉన్న‌వారు కూడా తాగ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. ఆవు పాలు అన్ని పాల క‌న్నా శ్రేష్ట‌మైన‌వ‌ని ఆయుర్వేదం చెబుతుంది. అయితే ఆవుల నుంచి పాల‌ను పిండాలంటే వాటిని ఎంతో కొంత శ్ర‌మ‌కు గురి చేయ‌క త‌ప్ప‌దు. కానీ అస‌లు ఆవులే లేకుండా పాల‌ను సృష్టిస్తే..? అద్భుతం క‌దా. అవును.. ఆ అద్భుతాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ స్టార్ట‌ప్ సుసాధ్యం చేసింది.

ఇజ్రాయెల్ లోని ఇమాజిన్ డెయిరీ లిమిటెడ్ అనే స్టార్ట‌ప్‌కు చెందిన ప్ర‌తినిధులు అద్భుతం సృష్టించారు. వారు పాలలోని ప్రోటీన్ల‌ను కృత్రిమంగా సృష్టించారు. అలాగే ఆవు పాల‌లో ఉండే పోష‌కాల‌ను కూడా ల్యాబ్‌లో సృష్టించారు. త‌రువాత వాటితో పాల‌ను త‌యారు చేశారు. అవి అచ్చం ఆవు పాల‌ను పోలి ఉండ‌డం విశేషం. నిజ‌మైన ఆవు పాల‌కు, కృత్రిమ ఆవు పాల‌కు పెద్ద‌గా తేడా లేద‌ని చెప్పారు. అందువ‌ల్ల ఆవులు లేకుండానే ఆవు పాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

వారు త‌యారు చేసిన పాల‌లో లాక్టోజ్ ఉండ‌దు. అందువ‌ల్ల లాక్టోజ్ అల‌ర్జీ ఉన్న‌వారు కూడా ఆ పాల‌ను నిర్భ‌యంగా తాగ‌వ‌చ్చు. అయితే ఈ పాల వ‌ల్ల ఆవుల‌ను శ్ర‌మ‌కు గురి చేయ‌డం త‌గ్గుతుంద‌ని, ఇది చాలా అద్భుత‌మైన విష‌యం అని స‌ద‌రు స్టార్ట‌ప్ ప్ర‌తినిధులు తెలిపారు. అయితే ఈ కృత్రిమ ఆవు పాలు మార్కెట్‌లోకి ఎప్పుడు వ‌స్తాయి ? అన్న వివ‌రాల‌ను వారు వెల్ల‌డించ‌లేదు. కానీ అతి త్వ‌ర‌లోనే వీటిని మార్కెట్‌లో విక్ర‌యించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.