జపాన్‌కు చెందిన కానే తనాకా అనే బామ్మ వయస్సు 116 సంవత్సరాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమె వద్దకు వెళ్లి ఆమె పేరును బుక్‌లో నమోదు చేసి ఆమెకు ధ్రువపత్రం అందజేశారు.
పెద్దల దగ్గర పిల్లలు ఆశీర్వాదం తీసుకుంటే.. వంద ఏళ్లు బతుకు నాయనా.. అని దీవిస్తారు. కానీ ఆ అంశం మన చేతుల్లో ఉండదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలా మరణం సంభవిస్తుందో తెలియదు. అలాగే ఎక్కడ ఎవరు 100 ఏళ్లకు పైగా జీవిస్తారో కూడా తెలియదు. అదంతా లలాట లిఖితాన్ని బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో 100 ఏళ్లకు పైబడి జీవించే వారు చాలా తక్కువగానే ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు చెప్పబోయే బామ్మ కూడా ఒకరు. ఈమె 116 ఏళ్లు జీవించింది. ఇంకా బతికే ఉంది. దీంతో ఇప్పుడీవిడ ప్రపంచంలోనే అత్యధిక వయస్సు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది.
జపాన్‌కు చెందిన కానే తనాకా అనే బామ్మ వయస్సు 116 సంవత్సరాలు. ఈమె జనవరి 2, 1903వ సంవత్సరంలో జన్మించింది. ఆమె తన తల్లిదండ్రులకు 7వ సంతానం. ఈ క్రమంలో ఈ బామ్మ 1922లో హైడియో తనాకాను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఈమె జపాన్‌లోని ఫుకువోకాలో అనే ప్రాంతానికి నివాసం మార్చి అక్కడే భర్తతో జీవించడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ఈమె అక్కడే ఉంటోంది. కాగా ఈ బామ్మకు ప్రస్తుతం 116 సంవత్సరాల వయస్సు అని తెలియడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమె వద్దకు వెళ్లి ఆమె పేరును బుక్‌లో నమోదు చేసి ఆమెకు ధ్రువపత్రం అందజేశారు. కాగా ఈ బామ్మ తనకు ఉన్న నలుగురు పిల్లలు కాక మరొకరిని దత్తత తీసుకుని పెంచడం విశేషం.
అయితే తనాకా బామ్మ 116 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ ప్రతి రోజూ యాక్టివ్‌గానే ఉంటుంది. నిత్యం ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తుంది. గణిత శాస్త్ర పుస్తకాలను చదువుతుంది. అలా ఆమె దినచర్య మొదలవుతుంది. ఇక ఈ బామ్మకు ముందు చియో మియాకో అనే మరో వృద్ధురాలు అత్యధిక వయస్సు ఉన్న వ్యక్తిగా రికార్డుకెక్కగా, ఆమె మరణించడంతో ఇప్పుడు రికార్డు తనాకా పేరిట నమోదైంది.