చిన్నారుల కోసం ‘స్మార్ట్‌’ డైపర్లు.. తడిని గుర్తిస్తాయి..!

-

చిన్నారులకు డైపర్లు వేస్తే వారికి సౌకర్యవంతంగానే ఉంటుంది. వారు ఎప్పుడు మూత్రానికి వెళ్లినా, మల విసర్జన చేసినా.. తల్లిదండ్రులకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, ప్రయాణాలు చేసిన సందర్భంలో చిన్నారులకు డైపర్లు బాగా ఉపయోగపడతాయి. అయితే అవి వ్యర్థాలతో పూర్తిగా నిండిపోతే అప్పుడు చిన్నారులకు అసౌకర్యం కలుగుతుంది. మరో వైపు డైపర్‌ నిండిన విషయం తల్లిదండ్రులకు కూడా ఒక్కో సారి తెలియదు. దీంతో చిన్నారులకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అయితే ఈ ఇబ్బందులను అధగమించేందుకు గాను పలువురు శాస్త్రవేత్తలు కొత్తగా స్మార్ట్‌ డైపర్లను రూపొందించారు. అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎవరు రూపొందించారో ఇప్పుడు తెలుసుకుందామా..!

అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు నూతనంగా స్మార్ట్‌ డైపర్లను తయారు చేశారు. వాటిలో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్స్‌ ఉంటాయి. అవి డైపర్‌ పూర్తిగా తడిగా అయి నిండినప్పుడు గుర్తించి స్మార్ట్‌ఫోన్లకు ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్‌ ద్వారా నోటిఫికేషన్లను పంపుతాయి. దీంతో తల్లిదండ్రులు వెంటనే చిన్నారుల డైపర్లు మార్చవచ్చు. ఈ క్రమంలో వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక చిన్నారులే కాకుండా పెద్దలు ధరించే అడల్ట్‌ డైపర్లలోనూ ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం వాడవచ్చని సదరు పరిశోధకులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ డైపర్లపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. వీటిని చాలా తక్కువ ధరకే అందించేందుకు వారు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ స్మార్ట్‌ డైపర్లు త్వరలో మనకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version