చాలా శాతం మంది ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. శుభ్రం చేయడానికి ఎంతో సమయాన్ని కేటాయించినా సరే కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిలో కిటికీల గ్రిల్ తుప్పు పట్టడం కూడా ఒకటి. దీనిని తగ్గించడానికి అందరూ నిమ్మకాయ, ఉప్పు లేక బేకింగ్ సోడాను ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్‌గా మారింది. అదే బంగాళదుంపతో కిటికీల గ్రిల్ ను శుభ్రం చేయడం. ఇలా చేయడం వలన బంగాళదుంపలో ఉండే ఆక్సలిక్ ఆమ్లం తుప్పుని తగ్గిస్తుంది.
అయితే కిటికీలు మరియు తలుపుల గ్రిల్స్ కు పట్టిన తుప్పును తొలగించడానికి బంగాళదుంపతో పాటు నిమ్మకాయ, ఉప్పు మరియు బేకింగ్ సోడా ను ఉపయోగించి శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వలన గ్రిల్‌కు పట్టిన తుప్పు తొలగిపోతుంది. అయితే ఇలా ఒకసారి చేస్తే ఫలితాలు రావడం కష్టం. కనుక రెండు మూడు సార్లు ప్రయత్నించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే కిటికీలకు మరియు గ్రిల్స్‌కు పట్టిన తుప్పును తొలగించడానికి శీతల పానీయాల్లో బేకింగ్ సోడాను కలిపి కూడా ఉపయోగించవచ్చు.
దీనికోసం ఒక కప్పులో చల్లని పానీయాలను పోసి, ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కలిపి గ్రిల్స్ పైన అప్లై చేసి తుడవడం వలన తుప్పు తొలగిపోతుంది. ఎప్పుడైతే తుప్పు ప్రారంభం అవుతుందో, ఇలాంటి పద్ధతులు ఎంతో తేలికగా ఉపయోగించవచ్చు. అయితే ఎక్కువ తుప్పు పట్టినప్పుడు ఇలాంటి చిట్కాలు పాటించినా మంచి ఫలితం ఉండదు. అటువంటి సమయంలో బలమైన రసాయనాలను ఉపయోగించి తుప్పును తగ్గించుకోవాల్సి ఉంటుంది. కనుక గ్రిల్స్ తుప్పు పట్టడం ప్రారంభమైనప్పుడే తగిన చర్యలను తీసుకోవాలి. దీంతో కిటికీలు ఎంతో శుభ్రంగా కనిపిస్తాయి.