హిజ్రాలు వివాహం చేసుకోవడం ఎక్కడైనా చూశారా? అయినా హిజ్రాలను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అంటారా? కానీ.. హిజ్రాలను పెళ్లి చేసుకోవడం కోసం చాలా మంది మగాళ్లు ముందుకొచ్చారు. అందుకే 15 మంది హిజ్రాలకు అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుక ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరిగింది. ఈ వేడుక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ముంబైకి చెందిన చిత్రగాహి ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ తన సొంత ఖర్చుతో ఈ పెళ్లిళ్లను జరిపించారు. ఒక్క ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్లే కాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన హిజ్రాలు కూడా అక్కడికి వచ్చి పెళ్లిళ్లు చేసుకున్నారు.
సలోని గులాం అనే హిజ్రా… గులామ్ నబీ అన్సారీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా ఆ జంటలంతా ప్రేమించుకున్నవాళ్లే. అయితే.. వీళ్ల ప్రేమను సహజంగానే వాళ్ల ఇళ్లల్లో ఒఫ్పుకోలేదు. ఎవరు కూడా హిజ్రాతో పెళ్లి అంటే ఒప్పుకోరు కదా. సమాజం వాళ్లను చిన్న చూపు చూసినప్పటికీ.. వాళ్లు మాత్రం ఒకటవ్వాలని బలంగా కోరుకున్నారు. ఒక్కటయ్యారు.
రాయ్ పూర్ లోని పూజారి పార్క్ మ్యారేజ్ ప్యాలెస్ లో వీళ్ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి వేడుక జరిగింది. సాధారణంగా పెళ్లి ఎలా జరుగుతుందో అలాగే వాళ్లకు కూడా నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కూడా నిర్వహించారు.