ఎప్పుడు చనిపోతామో ఎవరకీ తెలియదంటారు.. కానీ మనిషి చనిపోయేదానికి కొన్ని సెకన్ల ముందు తనకు అర్థమైపోతుందట.. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నా అని. ఈ క్రమంలోనే.. ఆ గోల్డెన్ సెకండ్స్ లో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయం పై విపరీతంగా పరిశోధనలు చేశారు. ఆఖరి 30 సెకన్లలో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే అంశంపై యుఎస్‌లోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు.
మరణానికి 30 సెకన్ల ముందు, మెదడులో ప్రకాశవంతమైన కాంతి మెరుస్తున్నట్లు వారు గుర్తించారు. శాస్త్రవేత్తలు దీనికి ‘లాస్ట్ రీకాల్’ అని పేరు పెట్టారు. అంటే జీవితంలోని చివరి జ్ఞాపకం. అనేక హాలీవుడ్ సైన్స్ చిత్రాలలో, శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించినట్లు చూపించారు.. అయితే, అది ఫిక్షన్ గా కొట్టి పడేసేవారు. కానీ తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆ ఫిక్షన్ నిజం అయినట్టుగా పేర్కొన్నారు.
87 ఏళ్ల వృద్ధుడిపై అధ్యయనం..
ఫ్రంటనీర్స్ సైన్స్ న్యూస్ (frontiers science News)లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఇటీవల, వైద్యులు 87 ఏళ్ల వృద్ధుడి మెదడును స్కాన్ చేశారు. ఈ వ్యక్తి గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.. అతని మెదడును స్కాన్ చేసినప్పుడు, అతని మరణానికి 30 సెకన్ల ముందు, అతని మెదడులో ప్రకాశవంతమైన కాంతి మెరుస్తున్నట్లుగా గుర్తించారట. దానిని ఆ వ్యక్తి కూడా చూశాడట. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఈ మార్పులు కొనసాగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మనిషి మెదడు చాలా క్లిష్టంగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధన న్యూరోసైన్స్ రంగంలో ఎంతగానో ఉపయోగపడుతుందట. మెదడు పనితీరును అర్థం చేసుకోవడం వల్ల రోగులకు చికిత్స చేసే కొత్త మార్గాలను కనుగొనవచ్చు.
మరణానికి ముందు మెదడులో కాంతి మెరుస్తూ ఉండటానికి కారణం ఆల్ఫా, గామా తరంగాలని డాక్టర్ గెమర్ తెలిపారు. రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత కొన్ని సెకన్ల పాటు ఈ తరంగాలు చురుకుగా ఉంటాయట.. ఈ కోణంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందట. సాధారణంగా.. మన పెద్దోళ్లు కూడా చెప్తుంటారు.. చనిపోయే ముందు వాళ్లకు తెల్లగా ఒక రూపం కనిపిస్తుందని..దాన్నే అందరూ వారి దైవంగా భావిస్తారట.
-Triveni Buskarowthu