2003లో తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత ఎస్మా యాక్టు ద్వారా 1.70 లక్షల మంది ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు.
ఇంతకీ అసలు ఎస్మా (ESMA) అంటే ఏమిటి ? మన దేశంలో దాన్ని ఎప్పుడు మొదటిసారిగా చట్టం రూపంలో తీసుకువచ్చారు ? ఇంత వరకు ఎక్కడైనా ప్రభుత్వాలు ఎస్మా ప్రయోగించాయా ? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…
ఎస్మా అంటే.. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్.. దీన్ని 1981లో చట్టం రూపంలో తీసుకువచ్చారు. ఈ చట్టం కింద ప్రభుత్వాలకు అత్యవసర సేవలకు అంతరాయం కలిగించే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అంటే.. ప్రజలకు అవసరమైన నీటి సరఫరా, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, రవాణా, పెట్రోలు, బొగ్గు, విద్యుత్, ఉక్కు, ఎరువులు, బ్యాంకింగ్, ఆహార ధాన్యాలు, పదార్థాల ఉత్పత్తి, రవాణా, పంపిణీ వంటి సేవలన్నీ.. అత్యవసర సేవల కిందకు వస్తాయి. ఈ సేవలను అందించే వారు ఎలాంటి సమ్మె చేయరాదు. సమ్మెపై నిషేధం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేస్తే.. చట్టాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. అప్పుడు అలాంటి పనులకు పాల్పడే వారిపై (సమ్మె చేసే వారిపై) చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎస్మా యాక్ట్ ద్వారా సమ్మె చేసే వారిపై చర్యలు తీసుకుంటాయన్నమాట.
ఇక ఎస్మా యాక్ట్ తో ప్రభుత్వాలు సమ్మె చేసే వారిని విధుల్లోంచి తొలగించవచ్చు. అవసరం అనుకుంటే జైలు శిక్ష కూడా విధించవచ్చు. అలాగే సమ్మెలో పాల్గొంటున్న వారికి ఇతరులు ఎవరైనా.. ఎలాంటి సహాయం చేసినా.. వారిపై కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. కాగా 1980లో దేశవ్యాప్తంగా చెలరేగిన కార్మికుల ఆందోళనలతోనే 1981లో ఈ ఎస్మా యాక్ట్‌ను తీసుకువచ్చారు. ప్రజలకు ఉపయోగపడే అత్యవసర సేవలను నిరంతరాయంగా అందించాలన్నదే ఈ చట్టం రూపకల్పన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయితే గతంలో పలు సార్లు ప్రభుత్వాలు ఎస్మాను ప్రయోగించాయి. కానీ ఆ తరువాత అవే ప్రభుత్వాలు ప్రజల చేతిలో పరాభవానికి గురయ్యాయి.
2003లో తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత ఎస్మా యాక్టు ద్వారా 1.70 లక్షల మంది ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. ఆ తరువాత జయలలిత పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే చాలా సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేసిన ఆ ఉపాధ్యాయులు మళ్లీ తమ ఉద్యోగాలను తాము సంపాదించుకోగలిగారు. అలాగే 2006లో విమానయాన రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు చెందిన సిబ్బంది సమ్మెకు దిగగా వారిపై కూడా ఎస్మా ప్రయోగించారు. అలాగే పలు చోట్ల సమ్మె చేపట్టిన వైద్యులు, ఆసుపత్రులకు చెందిన సిబ్బందిపై కూడా ఎస్మా ప్రయోగించారు. 2009లో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు, చమురు, గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినప్పుడు కూడా ఎస్మా యాక్టును ప్రయోగించారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఆర్‌టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తారా.. లేదా.. అన్నది ఉత్కంఠగా మారింది..!