ఒక జంట వివాహ బంధం ద్వారా ఒక్కటవుతుంది. నూతన దంపతులు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పెళ్లి అంటే వధూవరులు ఇద్దరికీ, ఇద్దరి ఇండ్లలోనూ సంతోషాలను తెచ్చి పెడుతుంది. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి మహిళ మాత్రం పలు విషయాలను ముందుగా తప్పకుండా తెలుసుకోవాలి.
వివాహం అవ్వగానే భర్త తన భార్యను తన తల్లిలా ఉండాలని కోరుకుంటాడు. భార్య చేసే ప్రతి విషయాన్ని అతను తన తల్లితో పోల్చి చూస్తాడు. తల్లిలా తనకు భార్య సేవలు అందిస్తుందా, లేదా, ఇంట్లో ఎలా ఉంది, ఏయే పనులు చేస్తుంది.. వంటి అంశాలను భర్త గమనిస్తాడు. దీంతో అత్తా కోడళ్ల మధ్య సహజంగానే పోటీ ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తుంచుకుని ఆ విధంగా మసలుకుంటే అత్తపై పైచేయి సాధించినట్లు అవుతుంది.
పెళ్లయిన మహిళలకే కాదు, పురుషులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వాటిని మహిళలు గుర్తెరగాలి. అలాగే భర్తకు ఏం కావాలో ముందుగానే తెలుసుకోవాలి.
భర్త ఏ చిన్న పనిచేసినా దాన్ని ఇంట్లో అందరు మెచ్చుకుంటారు. కానీ భార్య ఎంత హార్డ్ వర్క్ చేసినా అది ఆమె బాధ్యతగా భావిస్తారు. కనుక ఈ విషయాన్ని కూడా ముందుగానే గ్రహించాలి. హార్డ్ వర్క్‌ను ఎవరూ గుర్తించకపోయినా సరే ఫర్వాలేదు.. అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి.
స్త్రీలకు పెళ్లయ్యాక మెట్టినింట్లో వారికి భర్తతోపాటు ప్రాధాన్యతను ఇవ్వాలి. పుట్టింటి వారు అతిథులే అవుతారు. కనుక ఈ విషయాన్ని కూడా ముందుగానే గ్రహిస్తే.. ఆ విధంగా అత్తింట్లో మెలిగి మంచి మార్కులు కొట్టేయవచ్చు.
భార్యా భర్తలు అన్నాక గొడవలు రావడం సహజం. అయితే ఇద్దరిలో ఎవరైనా ఒకరు వెనక్కి తగ్గాలి. అవసరం అయితే భార్యే ముందుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధం కావాలి. ఇలా చేస్తే ఎలాంటి కలహాలు లేకుండా కాపురం సజావుగా సాగుతుంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే.. మహిళలు తమ సంసారంలో ఎలాంటి గొడవలు వచ్చినా వెంటనే సర్దుకుపోయి అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.