సిగరెట్ ఎలా మానేయ్యాలా అని ఆలోచిస్తున్నారా? ఐతే ఇది చదవాల్సిందే.

-

లైటర్

సిగరెట్ | Cigarette: మాస్టారు అగ్గిపెట్టుందా ? ఏం ఏ కొంపకి నిప్పెట్టేద్దామనీ ? అన్నాన్నేను అది వినగానే … అదేంటండీ అలా అంటారు ? మీక్కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువే , పళ్ళు రాలిపోకుండా చూసుకోండి అని జేబులో సిగరెట్టుని  సుతారంగా తీసి, అప్పటికే నల్లబడిపోయిన పెదాల చివర నొక్కి పట్టాడు. వెధవకి నిండా పాతికేళ్ళు లేవు. సర్లేవోయ్ , నేనేదో సరదాకి అన్నాను, కుర్రాడివి కదా తట్టుకోలేకపోయావ్. సరే ఇంద అని జేబులోంచి లైటర్ తీసి సప్ మని వెలిగించి అతని సిగరెట్ కి నిప్పు అందించాను . అతను ఒకసారి బాగా లోపలికి లాగి బిగబట్టి హా అని వదిలాడు . నా వంక చూసాడు, అతని కళ్ళలో ఒక రిలాక్సేషన్ .

 

కింగ్స్ పాకెట్ తీసి నాకొకటి ఇవ్వబోయాడు. నేనిప్పుడే ఒకటి తాగా అని చెప్పి మరో గంట తర్వాతే అని వద్దన్నాను. మళ్ళీ లోపల పెట్టేశాడు. ఏదైనా నాలుక జివ్వున లాగుతున్నప్పుడు సిగరెట్టు తాగితే వచ్చే కిక్కు వేరు, ఒక అమ్మాయి పెట్టే తొలి ముద్దు లా ! అన్నాన్నేను. మీలో మంచి రసవత్తరమైన వ్యసనపరుడు ఉన్నాడండీ, ఇంకా చెప్పండి వింటాను అన్నాడు మరోసారి పొగంతా గుండెల నిండా నింపుకుంటూ. సరే అలాగే , పద అక్కడ మర్రి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం అని అక్కడికి వెళ్లి ఇద్దరం కూర్చున్నాం. ఇప్పుడు నా కథ ప్రారంభించాను.

నాకిప్పుడు నలభై ఐదు, సరిగ్గా పాతికేళ్ల క్రితం కాలేజీలో..

ఇప్పుడైతే బట్టతల వచ్చి ఇలా ఉన్నాకానీ అప్పట్లో సంజయ్ దత్ లాంటి క్రాఫు ఉండేది. తెల్లకోటు భుజంపై వేసుకుని యమహా ఆర్ ఎక్స్ జడ్ బండి సైడు స్టాండు వేసి దాని మీద వాలి నిల్చొని వేళ్ళ మధ్యన అప్పట్లో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు తాగుతూ మా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ముందు నిల్చొని స్నేహితులతో సరదా కబుర్లు చెబుతూ ఉంటే, మా క్లాసుమేట్స్ తో పాటు , జూనియర్లు , సీనియర్లు తేడా లేకుండా అసలు ముఖం తిప్పి చూడని అమ్మాయి లేదంటే నమ్ముతావా ! ఏంటి సార్ మీరు డాక్టరా అని అడిగాడు కుర్రాడు ఒకసారి పొగంతా వదులుతూ…

అవునయ్యా అదేం పెద్ద విశేషం కాదులే అని చెప్పి నేను కొనసాగించాను. అలా చూసిన అమ్మాయిల్లో ఒకరు మరో నాలుగేళ్ళ ప్రేమ తరువాత నా భార్య అయింది, కానీ నాకిప్పటికీ గుర్తు. మా కాలేజీ ఆడిటోరియం దగ్గర మేము కలుసుకున్నప్పుడు ఆమె పెట్టిన ముద్దు, నేను మెడికల్ కాలేజీ మొదటి ఏడాది చేరినప్పుడు తాగిన మొదటి సిగరెట్టు తో వచ్చిన కిక్కును గుర్తు చేసింది. అందుకే అప్పట్నుంచి ఆవిడని, ఈ సిగరెట్టు ని వదల్లేదు,

సార్.. మంచి రొమాంటిక్ గా ఉంది ఇంకా చెప్పండి సార్! అని ఉత్సుకతతో అడిగాడు. నేను చెప్తున్నాను, ఆమె నడిచి వస్తుంటే మా బయోకెమిస్ట్రీ డిపార్టుమెంట్ ముందున్న తురాయి చెట్టు ఆమె కోసమే పూలు రాల్చి ఆ రోడ్డంతా ఎర్రతివాచీ పరిచేదా అన్నట్లు ఉండేది. ఆమె నవ్వులో కనిపించే వెలుగు వెన్నెలని తలదన్నేలా, ఆమె మాటలు హాస్టల్లో రావిచెట్టు పైనుంచి కూసే కోకిల అసూయ పడేలా ఉండేది. ఆమె జడ అరకులోయ లో జలపాతం నల్ల సిరాగా మారిపోతే ఎలా ఉంటుందో ఆలా ఉండేది. ఇక ఆమె వర్చస్సు గంధం, బంగారం ముద్దకట్టి వడపోస్తే వచ్చే వర్ణం తో మెరిసేది. ఆమె గడ్డం కింద చెయ్యి పెట్టి లైబ్రరీలో ఎక్కువ పేజీలున్న హారిసన్ పుస్తకం చదవడంలో లీనమైపోతే ఆమెను చూస్తూ ఆ సమయం నాకు స్తంభించిపోవాలని నాకు మరే ఆకలి నిద్ర వద్దని అనిపించేది. ఆమెంతో తెలివైంది , ఇష్టపడి చదివేది. ఆమె ప్రేమలో నాకు మరో లోకం ఉండేది.

ఇదిలా ఉంటే మా ఇద్దరి ఎంబీబీయస్ అయిపోగానే మా నాన్నకి కాన్సర్ రావటం ఆయన చనిపోకముందే మాకు పెళ్లి కావటం చక చకా జరిగిపోయాయి. మా నాన్నగారికి వైద్యం చేయించినప్పటికీ ఎంతోకాలం బ్రతకలేదు. ఇదిగో మన సిగరెట్ తాగటం వలనే ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చి చనిపోయారు.

కాన్సర్ ఒక గమ్మత్తయిన జబ్బు అది చివరి స్థాయికి వచ్చేవరకు బయటపడదు , బయటపడింతర్వాత బతికి బట్ట కట్టనివ్వదు. అందుకే నేను డాక్టర్ అయినా ఆయనకి కాన్సర్ వచ్చిన విషయాన్నీ కనిపెట్టలేకపోయాను. అయితే నేనేం పెద్ద చదవలేదు అనుకో, ఎదో అలా పరీక్షల ముందు చదివి గట్టెక్కటం వరకు వచ్చు. అయన పోయిన తరువాత నా భార్యకి పీజీ సీటు, ప్రెగ్నెన్సీ రెండూ ఒకేసారి వచ్చాయి. మాకు చాలా ఆనందం వేసింది. అయితే నాకే ఇంకా సీటు రావాలి. దాంతో ఆవిడ డ్యూటీకి వెళ్తే నేను ఇంట్లో వంట వార్పు చేస్తూ చదువుకునే వాడిని. బాగా ఒత్తిడి ఫీల్ అయ్యేవాడిని.

ఆ సమయంలో నాకు సిగరెట్టే పెద్ద నేస్తం.రోజుకి ఎలా లేదన్నా ఒక రెండు మూడు పెట్టెలు తాగేవాడిని అయితే నా భార్యకి ఐదో నెల వచ్చేసరికి వాళ్ళ ప్రొఫెసర్ రొటీన్ చెక్ చేస్తూ కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని, ఇకనుంచి రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పారు. పీజీ చదువుతున్నపుడు అసలు సెలవులే దొరకవు. అలాంటిది ఆవిడ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుని ప్రసవం తరువాత మళ్ళీ డ్యూటీ చేరమనటం మేము చాలా అదృష్టంగా భావించాం.

నా భార్య ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు మాత్రం ఒత్తిడి తగ్గలేదు, నేను సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాను. నా భార్యకి కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గటం లేదు. ఈలోగా నెలలు నిండుతున్నాయి. నాకు కూడా పిజి పరీక్ష తేదీ దగ్గరపడుతోంది. ఈలోపు నా భార్యకి కాళ్ళ పొంగులు వచ్చాయి.

మా ప్రొఫెసర్ చూసారు, రక్త పరీక్ష, నీరుడి పరీక్ష చేసారు. ఇప్పుడు నెలలు నిండి ప్రసవానికి దగ్గర అవుతుండటం మూలాన జాగ్రత్తగా ఉండాలని, ముందులు ఇస్తున్నా బ్లడ్ ప్రెషర్ తగ్గటం లేదని చెప్పారు. కొంచెం ఆందోళన పడినా ఏం కాదులే అని ఒకరికొకరం చెప్పుకున్నాం .ఒక మనిషి ఆశాభావం ఏంటంటే ఎందరికి ఎన్ని కష్టాలు వచ్చినా నాకు అవి రావులే అనుకుంటాడు అందువలన అవి వస్తేఎలా ఎదుర్కోవాలో తెలీకుండా సమయం గడిపేస్తాడు.సరిగ్గా అలాంటిదే నా జీవితంలో జరిగింది. ఎల్లుండి తనని ఆసుపత్రిలో చేర్చాలి అనగా ఈరోజు నేను పీజీ పరీక్షకు వెళ్ళాను. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది. నేను పొద్దున్న వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరేసరికి నాభార్య స్పృహలేకుండా హాల్లో పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ప్రెగ్నెన్సీ లో వచ్చే హై బ్లడ్ ప్రెషర్ వలన ఎక్లమ్ప్సియా అనే సమస్య వచ్చి మూర్ఛ వచ్చి పడిపోయింది. ఆమె కోమా లోకి వెళ్లి తిరిగిరాలేదు. లోపలి బిడ్డ కూడా దక్కలేదు

నేనింక ఏమీ దిక్కుతోచని స్థితిలో ఆమెపై పడి రోదిస్తుంటే మాప్రొఫెసర్ వచ్చి ఓదార్చారు.ఆమె మాట్లాడుతుండగా నా షర్ట్ అంతా సిగరెట్ వాసన ఉండటం గమనించారు. అప్పుడామె చెప్పారు. నేను విపరీతంగా ఇంట్లో సిగరెట్లు కాల్చటం వలన నా భార్య పాసివ్ స్మోకింగ్ కి గురైందని అందువలన ఆమె బ్లడ్ ప్రెషర్ తగ్గలేదని, తద్వారా అది ఫిట్స్ కి దారి తీసిందని. అంతే అది విని నేను హతాశుడయ్యాను. నేను తేరుకోడానికి చాలా రోజులు పట్టింది . ఆమెను దూరం చేసిన సిగరెట్ ను అక్కడితో వదిలేసాను.

చాలా రోజులు నా స్టయిల్ నచ్చి ఇష్టపడింది అనుకున్న నాకు, మాకు పెళ్ళైన ఏడాది నా పుట్టినరోజు కి పంపిన వీడియోలో మా హాస్పిటల్లో చేరిన ఎవరూలేని ఒక ముసలావిడకి అన్నీ నేనే అయ్యి చేసిన సేవ చూసి నేను నచ్చానని,తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అని ఆశపడింది అని చెప్పింది. నావలనే ఆమె చనిపోతుంది అని ఊహించలేని మూర్ఖుడిని అని చెప్పడం ముగించాను.

ఈలోపు కుర్రవాడు సిగరెట్టు ధ్యాస మరిచేసరికి చెయ్యికాలింది. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతూ అడిగాడు , కానీ మీరింకా సిగరెట్టు కాలుస్తున్నారు అని.  దానికి నేను అవునయ్యా ఇలా అగ్గిపెట్టె ఉందా అని అడిగేవాళ్లందరికీ నా కథ ను చెప్పటానికి ఈ లైటర్ పెట్టుకు తిరుగుతుంటాను. నేను వాళ్ళకి వెలిగించి ఇచ్చే సిగరెట్ వాళ్ళు కాల్చే ఆఖరిది అని నేను కోరుకుంటాను. వాళ్ళ కుటుంబం లో ఈ పొగ యే ప్రాణాన్ని తీయకపోతే చాలు అని ఆశిస్తుంటాను. అని చెప్పి ముందుకు కదిలాను. వెంటనే ఆ అబ్బాయి నా చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో సిగరెట్టు పెట్టె విసిరేసి ” మాస్టారు , నాకో లైటర్ కొంటారా !!” అని అడిగాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version