వెంకటేష్, శిల్పాశెట్టి నటించిన ఒకప్పటి సినిమా.. సాహసవీరుడు, సాగరకన్య గుర్తుంది కదా. అందులో శిల్పాశెట్టి మత్స్యకన్యలు ( Mermaids )గా నటించి అలరించింది. అయితే అది సినిమా వరకే. వాస్తవ ప్రపంచంలో మత్స్యకన్యలు ఉంటారా ? అంటే.. ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మత్స్యకన్యలు సముద్ర తీరాల వద్ద కనిపించినట్లు చరిత్రలో కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. అయితే మత్స్యకన్యలు ఉండరనేది కొందరి మాట.
1187వ సంవత్సరంలో ఇంగ్లండ్‌లోని సుఫ్లోక్ తీర ప్రాంతంలో మత్స్యకన్యను పోలిన వ్యక్తి కనబడ్డాడని ఆధారాలు ఉన్నాయి. అలాగే 1305, 329లలోనూ గ్రిమ్సీ అనే ద్వీపంలో మత్స్యకన్యలు కనిపించారని చరిత్ర చెబుతోంది.
1430లో హాలండ్‌లో ఈడమ్, వెస్ట్ ఫ్రీస్‌ల్యాండ్ అనే చోట్ల మత్స్యకన్యలు కనిపించారు. అలాగే 1492లో క్రిస్టఫర్ కొలంబస్ కూడా మత్స్యకన్యలను చూశాడని ఆధారాలు ఉన్నాయి. 1560లో కొందరు జాలర్లు సెయ్‌లాన్ తీర ప్రాంతంలో మత్స్యకన్యలతోపాటు ఆ రూపంలో ఉన్న పురుషులను కూడా చూసినట్లు చరిత్ర చెబుతోంది.
ఇలా అడపా దడపా మత్స్యకన్యలను చూసినట్లు కొందరు చెబుతూ వచ్చారు. కానీ మత్స్యకన్యలకు చెందిన నిజమైన ఫొటోలు గానీ, వీడియోలు కానీ లేవు. అందువల్ల మత్స్యకన్యలు అనేవారు ఊహాజనితమైన వారని కొందరు అంటుంటారు.
ఇక మత్స్యకన్యల వల్ల అదృష్టం వస్తుందని, వారు సముద్రంలో అంతు లేని సంపదను దాస్తారని కొందర చెబుతారు. కానీ వారి వల్ల చెడు జరుగుతుందని కొన్ని వర్గాల వారు నమ్ముతారు. ఇక మత్స్యకన్యలు అవసరం అయితే పూర్తిగా మానవరూపం కూడా ధరించగలరని, వారు పైన సగం మనిషి, కింద సగం చేప ఉన్నా.. కొన్ని సందర్భాల్లో పూర్తిగా చేపలా లేదా పూర్తిగా మనిషిలా మారగలరని, మనుషులతో వారు సత్సంబంధాలను కలిగి ఉంటారని కొందరు అంటారు. అయితే మత్స్యకన్యలు ఉంటారనడానికి కచ్చితమైన ఆధారాలు లేకపోయినా.. చరిత్రలో జరిగిన సంఘటనలను బట్టి చూస్తే మత్స్యకన్యలు ఉంటారని.. ఇప్పటికీ కొందరు నమ్ముతారు.