కరోనా వైరస్ లక్షణాల్లో జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా ఉండడంతో ఇలాంటి లక్షణాలు కనిపించగానే భయంతో వణికిపోతున్నారు. జలుబు చేసిందంటే చాలు కరోనానేమో అనుకుని బెంబేలెత్తిపోతున్నారు. ఇంకా గొంతునొప్పి ఉంటే చాలు కరోనా వచ్చిందేమో అనుకుని టెస్ట్ కి వెళ్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం సరైనదే అయినప్పటికీ అనుక్షణం భయం భయంగా బ్రతకడం కొంచెం కష్టంగా మారింది.
ఐతే కరోనా లక్షణాల గురించి పక్కన పెడితే, జలుబు, ఫ్లూ మధ్య తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా జలుబు, ఫ్లూ ఒకటే అనుకుంటారు. కానీ సాధారణ జలుబుకి ఫ్లూకి చాలా తేడా ఉంది. జలుబు చేసినపుడు ముక్కు స్తబ్దంగా మారడం, తుమ్ములు రావడం జరుగుతుంది. జ్వరం వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉంటాయి. గొంతునొప్పి ఉండే అవకాశం ఎక్కువే. శరీరం బలహీనంగా మారడం చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. అది కూడా అంత తీవ్రంగా ఉండదు.
దగ్గు సాధారణమే కానీ చాలా తక్కువ. ఐతే ప్రస్తుతం చెప్పుకున్న లక్షణాలన్నీ ఫ్లూ తో బాధపడుతున్న వారికి కూడా ఉంటాయి. దాదాపు జలుబు, ఫ్లూ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి తీవ్రత ఫ్లూ తో బాధపడుతున్న వారిలో చాలా ఎక్కువ. రెగ్యులర్ గా జ్వరం ఉండటం, శరీరం బలహీనంగా మారడం.. తుమ్ములు చాలా తక్కువగా వస్తుంటాయి. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. గొంతు మంట అప్పుడప్పుడు వస్తుంటుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువగా ఉండడం, దగ్గు ఎక్కువగా ఉండడం మొదలగు లక్షణాలు ఫ్లూ తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటాయి. జలుబుకి, ఫ్లూకి తేడా చిన్నదే అయినప్పటికీ ఫ్లూ తో బాధపడుతున్న వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవడం మంచిది.