భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక విమానంలో శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి దోమలగూడ చేరుకున్న అమిత్ షా బీమా మైదాన్‌లో చేపట్టిన స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భాజపా కార్యాలయానికి చేరుకుని విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… తెలంగాణలో అన్ని స్థానాల్లో భాజపా పోటీచేయనుంది, కేసీఆర్ పాలన చూసిన ప్రజలు మరో సారి తెరాసకు పట్టం కడతారని భావించడం లేదన్నారు. మరో సారి కేసీఆర్ గెలిస్తే తెలంగాణలో ప్రజలు బానిసలుగా బతకాల్సిందే అంటూ అయన ఆరోపణలు చేశారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వ కంటే భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 20 రెట్లు అధిక నిధులు ఇచ్చిందన్నారు. 13 వ ఆర్థిక సంఘం ద్వారా 16,597 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణకు చేయగలిగిందంతా చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్రం అందిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం, మూఢ నమ్మకాలతో సచివాలయానికి సైతం వెళ్లకుండ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న బహిరంగ సభ నుంచి ఎన్నికల ప్రచారానికి అమిత్ షా శ్రీకారం చుట్టనున్నారు.