ఆ అమ్మాయి పేరు నాగమణి. వయస్సు 20 ఏళ్లు. ప్రస్తుతం ఉండేది జగిత్యాల జిల్లాలో. తల్లిదండ్రులు ఎడ్ల శంకర్, జనాభాయిలతో కలసి ఇంతకుముందు కామారెడ్డి జిల్లాలోని రాజుల గ్రామంలో నివసించేది. నాగమణికి 11ఏళ్లప్పుడు మొదటిసారి నాగుపాము కాటేసింది. హుటాహుటిన అందుబాటులో ఉన్న నాటువైద్యుడి సహాయంతో బతికి బయటపడింది. తరువాత ఆరునెలలకు మళ్లీ ఒకసారి, 12వ యేట అడుగుపెట్టాక ఇంకోసారి త్రాచుపాములు కరిచాయి. ఇలా ఒకే అమ్మాయిని పలుమార్లు నాగుపాములు కరవడం అమ్మానాన్నలకే గాక, గ్రామస్థులందరికీ కూడా విచిత్రంగా తోచింది. నాగదేవతను కులదైవంగా ఆరాధించే శంకర్ కుటుంబం తమ కూతురికి నాగమణి అని కూడా పేరుపెట్టుకుంది. తమకే ఇలా జరగడం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. పైగా ఆ ఊరివాల్లు ఎవరికి తోచినట్లుగా నాగజాతి మీ కుటుంబంపై పగబట్టిందని, ఏదో అపచారం చేసారని, పూజలు, హోమాలు చెయాలని వాళ్లు అంటూండడంతో శంకర్ కుటుంబం బెదిరిపోయారు.
ఇక లాభం లేదని తలచిన వాళ్లు, ఊరు మారితే ఫలితం ఉంటుందేమోనన్న ఆశతో పెట్టేబేడా సర్దుకుని జగిత్యాల జిల్లా, అమ్మక్కపేటకు వచ్చి కూలీనాలీ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ పరిస్థితులేమీ మారలేదు. నాగమణి కోసమే వచ్చినట్లుగా వచ్చి, కాటేసి వెళ్లిపోతున్నాయి. ఈ వూరిలో కూడా ఆ అమ్మాయి రెండుసార్లు పాముకాటుకు గురైంది. అయితే ప్రతీసారి ఏదో ఒకరకం వైద్యం దొరకడం నాగమణి ప్రాణాలతో బయటపడటం కూడా విచిత్రమే. నిన్నటికినిన్న, ఆగస్టు 22న అందరు ఇంట్లో ఉండగానే నాగుపాము వచ్చి నాగమణిని కాటేసి వెళ్లిపోయింది. వెంటనే అందరు అమ్మాయిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం దవాఖానాలో కోలుకుంటున్న నాగమణి ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడంలేదు. తొమ్మిదేళ్ల నుంచి పాములు అదేపనిగా ఒకే అమ్మాయిని కాటేయడం, ఆశ్చర్యకరంగా ప్రతీసారీ నాగమణి ప్రాణాలతో బయటపడటం స్థానికులందరికి విచిత్రంగానూ, అయోమయంగానూ అనిపిస్తోంది. ఇది ఇకముందు కూడా కొనసాగుతుందా..నాగమణి జీవితం ఎలా గడవబోతోందనేది మిలియన్ డాలర్ ప్రశ్న.