వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి
సాగు చేయటమంటే ప్రకృతి ప్రేమించడమే.. సాగు విధానంలో మనుషులు నీతి తప్పతితే ప్రకృతి గతి తప్పుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నర్సింహపాలెంలోని రైతులతో ఈ రోజు ఉదయం ముఖాముఖిగా సమావేశమై ప్రకృతి వ్యవసాయ తీరుతెన్నులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయం పై రైతుల నుంచి పలు అభిప్రాయాలను ఆయన సేకరించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు రావాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మ తర్వాత అందరిని ప్రేమించేవాడు రైతు మాత్రమేనని.. ఒకప్పుడు భారతీయ వ్యవసాయ విధానం ప్రకృతి హితంగా సాగేదని ప్రస్తుతం మనుషులు నీతి తప్పడం వల్ల ప్రకృతి గతి తప్పుతోందన్నారు. నా చిన్న తనంలో వ్యవసాయం చేసి అనుభవం ఉంది నాడు పురుగు మందులను వాడేవాళ్లం కాదని గుర్తు చేసుకున్నారు.
హనుమాన్ జంక్షన్ వద్ద గల కొంత మంది రైతులు నాడెప్ కంపోస్ట్ ద్వారా చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన పరిశీలించి వారిని అభినందించారు. వరి పొలాల్లో తిరుగుతున్న వెంకయ్యనాయుడుని చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో పాటు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, కలెక్టర్ లక్ష్మీకాంతం తదితర అధికారులు పాల్గొన్నారు.