నగరంలో గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. వినాయక నిమజ్జనోత్సవం ప్రారంభమైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2లక్షలకు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లతో పాటు నిమజ్జన జరిగే ప్రాంతాల్లో 19 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. షీటీమ్స్, సిటీ ఆర్మ్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈసారి నగరంలో 15వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు. ట్యాంక్‌బండ్‌పై 36 అధునాతన క్రేన్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎలాంటి సమస్య తలెత్తినా భక్తులు 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల భద్రత అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.