మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్ట్ లో తాత్కాలిక ఊరట లభించింది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 12వ తేదీ వరకు హరీష్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు పేర్కొంది. హరీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు మరోసారి పొడిగించింది.
అనంతరం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఫోన్ టాపింగ్ ఆరోపణలలో హరీష్ రావు పై డిసెంబర్ 3 మంగళవారం రోజున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హరీష్ రావును అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
ఈ కేసులో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డిజిపి రాధా కిషన్ రావు కూడా ఉన్నారు. తన ఫోన్ టాప్ చేశారని బాచుపల్లి కి చెందిన చక్రధర్ గౌడ్ హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు పై కేసు నమోదయింది.