-
తూర్పులో సీనియర్లతో చంద్రబాబు ఫుట్‌బాల్
-
గొంతు చించుకునే గోరంట్లకు నియోజకవర్గం మార్పు
-
గొల్లపల్లి గొంతులో వెలక్కాయ?
2019 ఎన్నికలకు టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో అరడజనుమంది ఎమ్మెల్యేలను తప్పించి.. వారి స్థానంలో సమర్థులను నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రజా వ్యతిరేకత, కేడర్‌లో అసమ్మతి ఎక్కువ ఉన్నవారు, వయో భారంతో ఉన్నవారు, పార్టీపట్ల పెద్దగా కమిట్‌మెంట్‌లేకుండా సాదాసీదాగా ఉన్న నేతలూ ఈ జాబితాలో ఉన్నారు.టికెట్టు దక్కని నేతల జాబితా
- వరుపుల సుబ్బారావు… ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయసు కూడా 75 ఏళ్లు దాటడంతో ఈ వయసులో మరోసారి టికెట్ ఇవ్వద్దొని టిడిపి అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఈయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనుమడు రాజాకి అవకాశం దక్కవచ్చని ప్రచారం.
- కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మికి ఈసారి టికెట్ రాకపోవచ్చంటున్నారు. ఎంపీగా ఉన్న తోట నరసింహాన్ని తప్పిస్తే ఏదో అసెంబ్లీ నుంచి టిక్కెట్టు ఇస్తారన్న ప్రచారం ఉంది. దీంతో మరో ఎమ్మెల్యేని పక్కనపెట్టాల్సిన పరిస్థితి.
- టిడిపి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ తరఫున గొంతు చించుకునే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈసారి రాజమహేంద్రవరం రూరల్ నుంచి కాకుండా సిటీకి మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రూరల్ నుంచి కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు డిసైడ్ కావడంతో గోరంట్ల మారక తప్పని స్థితి.
- కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి, రాజోలు ఎమ్మెల్యేగొల్లపల్లి సూర్యారావుకి టిక్కెట్టు ఇవ్వకుండా పార్టీలో క్రియాశీల పదవిని కట్టబెట్టే అవకాశమూలేకపోలేదు. రాజోలు నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరిని పార్టీలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఓకే అయితే సూర్యారావుకి మార్పు కానీ, పార్టీ పదవి కానీ ఉండవచ్చు.
ఇక ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎంపికను బట్టి మరో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్టు దక్కదనే వార్త ఈ పాటికే సదరు అభ్యర్థులకు చేరిందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని, అప్పుడు మార్పు వల్ల టిడిపికే చేటు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ ఆరుగురికి ఈసారి ఎమ్మెల్యే టికెట్లు లేనట్లే?
-