వచ్చేనెల మే 13 న తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి షిఫ్ట్ అవుతున్నారు.ఇక గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలోకి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారాన్ని గంగుల కొట్టిపారేశారు.ప్రజల తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందని, కరీంనగర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.