విశాఖ మన్యంలో ఇటీవల హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి చోటు కల్పించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీనియర్లతో చర్చిస్తున్నట్లు సమాచారం. కిడారి పెద్ద కుమారుడైన శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగిస్తే, ప్రజలు ముఖ్యంగా గిరిజనుల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్న సందర్భంలో ఆయన ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో రాయలసీమ ప్రాంతంలో తెదేపాకు పట్టు పెరిగింది.
అదే ఫార్ములాను శ్రావణ్ కుమార్ విషయంలో పాటిస్తే ఇటు క్యాబినెట్‌లో గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించలేదనే విమర్శలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రాజకీయంగా లబ్ది చేకూరుతుందని తెదేపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే విషయం తెలుస్తోంది. శాసనసభ, మండలిలో ఎందులోనూ శ్రావణ్ సభ్యుడు కాకపోయినా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరునెలల్లోగా ఎన్నికవ్వాలి. ఈలోగా సాధారణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేదు ఒకవేల అవసరమైతే అప్పుడే ఆలోచిద్దాం అంటూ తెదేపా నేతతో చర్చించినట్లు సమాచారం.