వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 వేల కి.మి చేరుకుంటున్న సందర్భంగా దేశ పాత్రుని పాలెంలో ఫైలాన్ ఆవిష్కరించనున్నామని వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా బొత్సా మాట్లాడుతూ… ప్రజాసంకల్ప యాత్ర చంద్రబాబు చేసిన హైటెక్ పాదయాత్రలాంటిది కాదని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్‌ఆర్ పాదయాత్రతో అకృత్యాలు చేస్తున్న తెదేపా ప్రభుత్వం ఎలా పతనమైందో, ప్రస్తుత ప్రజాసంకల్పయాత్రతో తెదేపా కాల గర్భంలో కలిసిపోవడం కాయమని జోష్యం చెప్పారు.
ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. దీనికి ఉదాహరణే .. తెదేపా ఎంపీ జేసి, పోలీసుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు అని పేర్కొన్నారు. మేం అవినీతి చేసుంటే..ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో కాంట్రాక్టు రద్దు విషయంలో ఎలాంటి ముడుపులు తీసుకోలేదని అప్పటి కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లమ్మ సాక్షిగా ప్రమాణకం చేస్తే తలదించుకుని క్షమాపణ చెప్తానని బొత్సా సవాల్ విసిరారు.
చంద్రబాబు వెనుకబడిన విజయనగరం జిల్లాకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. సంవత్సరంలో పూర్తి చేస్తామన్న తారకరామ తీర్థసాగర్ పనులు ఎక్కడి వరకు వచ్చాయని ప్రశ్నించారు. ఈ నెల 24 న కొత్త వలసలోని బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.