తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వెనకబడలేదని.. నాయకులే వెనకబడేశారని.. స్వాతంత్రానికి పూర్వమే రైల్వే, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న గడ్డగా తెలంగాణ విలసిల్లిందన్నారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాళా తీసిన రాష్ట్రంగా ప్రచారం చేయడం సరికాదన్నారు.
ధాన్యం దిగుబడి, జీఎస్డీపీ వృద్ధి రేటు, అత్యధిక బడ్జెట్ స్థాయి వంటి అంశాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.సీఎం రేవంత్ మాటల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పారు.సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2014లోనే తెలంగాణ పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లని చెప్పారు. ఏటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం పెరిగేదన్నారు. 2023-24లో రూ.1.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, 2024-25లో రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయం కూడా 2014లోనే రూ.6 వేల కోట్లు ఉందని, 2023-24లో రూ.20 వేల కోట్ల పన్నేతర ఆదాయం ఉందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని సీఎం రేవంత్ మాట్లాడాలని..పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ హితవు పలికారు.