వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధానమైన పార్టీలు సిద్ధమవుతున్నాయి.వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు సొంతం చేసుకునే దిశగా కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే ఇటీవల రాష్ట్రంలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ కి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా షాక్ తగిలేలా ఉంది. తాజాగా ఏబీపి-సి ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ రిలీజ్ చేసింది.
రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 లోక్సభ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. టిఆర్ఎస్ పార్టీకి మూడు నుంచి ఐదు సీట్లలో మాత్రమే గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. జాతీయ పార్టీ అయిన బిజెపి పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని ఆ పార్టీ కేవలం ఒకటి నుంచి మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఇతరులు ఒకటి లేదా రెండు స్థానాలలో విజయం సాధించవచ్చు అని తెలిపింది.