కర్నూలు జిల్లా జలదుర్గంలో మంగళవారం ఉదయం పదో తరగతి విద్యార్థి మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా వస్తే తన అన్నకు ఉద్యోగం వచ్చేదని దీంతో వారికి ఆర్థిక ఇబ్బందులు తీరిపోయేవని ఆవేదన చెందుతూ.. సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
విద్యార్థి మహేంద్ర ఆత్మహత్య ఘటనపై ప్రతిపక్ష నేత జగన్, రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీర రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థ వైఖరి వల్లే నేడు పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా ప్రత్యేక హోదాపై ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చారన్నారు. నాలుగున్నరేళ్లు కాలయాపన చేసిన తెదేపా ప్రభుత్వం ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి ఆత్మహత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు మహేంద్ర కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆత్మహత్యల వల్ల ప్రత్యేకహోదాను సాధించలేం.. పోరాటం ద్వారానే ప్రత్యేక హోదా సాధిద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి ప్రజలు బలి కావొద్దని ఆయన కోరారు.