ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దుకై డిమాండ్ చేస్తూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో అమరావతిలోని అసెంబ్లీ, మంగళగిరి రహదారి, జాతీయ రహదారి, కృష్ణా నది కరకట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న ప్రతీ ఒక్కరిని, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని ఉపాధ్యాయులను పోలీసులు ఇప్పటికే బైండోవర్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సుమారు 400 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి తాడేపళ్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు.
సీఎం సమీక్ష
సీపీఎస్ రద్దును కోరుతూ ఉద్యోగుల ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో 11గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విధానంపై బుధవారం శాసన మండలిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.