మోదీ విద్యార్హతపై విమర్శలు.. కేజ్రీవాల్‌కు సమన్లు

-

ప్రధాని మోదీ విద్యార్హతకు సంబంధించి ఆరోపణలు చేసిన ఢిల్లీ CM కేజీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్లకు పరువు నష్టం కేసులో నోటీసులు వచ్చాయి. ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ అవమానకర ప్రకటనలు చేశారంటూ గుజరాత్‌ యూనివర్సిటీ ఆరోపించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్‌ 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ విలేకరుల సమావేశంలో, ట్విట్టర్ హ్యాండిల్‌లో యూనివర్సిటీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని యూనివర్సిటీ పేర్కొంది. దాంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించింది.

ఈ మేరకు అహ్మదాబాద్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జయేష్‌భాయ్‌ చౌవాటియా కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌లకు సమన్లు జారీ చేశారు. మే 23న విచారణకు హాజరుకావాలని సూచించారు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల కిందట స్థాపించారని, ప్రజల్లో మంచి పేరుందని, ఇలాంటి ఆరోపణలతో యూనివర్సిటీపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటోందని గుజరాత్‌ యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయంతో తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు గుజరాత్‌ హైకోర్టు సైతం జరిమానా విధించింది. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పు అనుమానాలను మరింత పెంచిందని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version