వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.నూతనంగా రూపొందించిన రైతునేస్తం అప్లికేషన్లతోపాటు ఆధునీకరించిన ఏపీసీపీడీసీఎల్ వెబ్ సైట్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. సోమవారంనాడు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచాంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు వినియోగదారులు సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని తెలిపారు.
ఈ సంస్కరణల్లో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదట ఏపీసీపీడీసీఎల్ లో బోట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా ఆయన చెప్పారు. వినియోగదారుల సౌలభ్యంకోసం వాట్సాప్ (91333 31912) సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయాన్ని మంత్రి ప్రకటించారు. వీటిద్వారా వినియోగదారులు నేరుగా చాట్ చేసి తమ సమస్యలను అధికారులు,సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు. రైతుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలనే లక్ష్యంతో రైతునేస్తం అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.