యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై పోలీసుల తీరును తప్పుపడుతూ.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే… ఆడపిల్లలను బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చినట్లు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అటు, ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌ల ధర్మాసనం సోమవారం విస్మయం వ్యక్తం చేసింది. ‘యాదాద్రి’ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంపై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయమై పోలీసులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు.