తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల మండలి కార్యాలయానికి వేసిన తాళాన్ని, రెవెన్యూ అధికారులు వేసిన తాళాన్ని తీసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తమిళ నిర్మాతల మండలిలో అవినీతి ఆరోపణలు తలెత్తడంతో టి.నగర్‌లో వున్న నిర్మాతల మండలి కార్యాలయానికి అసమ్మతివర్గానికి చెందిన సినీనిర్మాతలు ఏఎల్ అళగప్పన్, సురేశ్ కామాక్షి..తదితరులు. ఆఫీసుకు తాళం వేశారు. దీంతో ఈ సంఘటనపై విశాల్ వర్గానికి చెందిన దర్శక నిర్మాత ప్రవీణ్‌కాంత్.. పాండి బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసి గురువారం విశాల్ తన మద్దతుదారులతో కలిసి వెళ్లి కార్యాలయం తాళం బద్దలుకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుచెప్పడంతో పాటు గిండి తహసీల్దార్ నిర్మాతల మండలి ఆఫీసుకు సీలు వేయడంపై విశాల్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ఇరువైపుల వాదనలు విన్న కోర్టు నిర్మాత మండలి కార్యాలయానికి వేసిన తాళం, సీల్‌ను తొలగించాలంటూ ఆదేశించింది. ఈ మొత్తం వివాదంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసమ్మతి వర్గం నిర్మాతల వేసిన తాళాన్ని తీసేందుకు ప్రయత్నించి విశాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీసింది. ఎన్ని వివాదాలున్నా మండలి అధ్యక్షుడి హోదాలో లోనికి వెళ్లే అధికారం విశాల్‌కు ఉంటాయని.. ఆయన్ని అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొంది. ఏదైన ఇండస్ట్రీలో వివాదాలు తలెత్తినప్పుడు పోలీసులు వాటిని జఠిలం చేయకుండా రాజీ మార్గాలు చేయాలని సూచించింది.