ప్రముఖ చిత్రకారులు వేసే పెయింటింగ్స్ సహజంగానే రూ.లక్షల ఖరీదుతో అమ్ముడవుతుంటాయి. ఇక పురాతన కాలానికి చెందిన పెయింటింగ్స్ అయితే రూ.కోట్లలో ధర పలుకుతాయి. కానీ ఒక వీడియో క్లిప్.. అది కూడా జనాలందరూ ఉచింతగానే చూడవచ్చు.. కానీ అలాంటి క్లిప్‌ను ఒక వ్యక్తి ఏకంగా రూ.49 లక్షలకు (67వేల డాలర్లు) కొన్నాడు. ఇది చిత్రమనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఆ వీడియో క్లిప్‌ను అతను 6.6 మిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.48.3 కోట్లు) విక్రయించాడు. అవును.. అందుకనే ఆ వీడియో వైరల్ అవుతోంది.
మియామికి చెందిన ఆర్ట్ కలెక్టర్ పాబ్లో రోడ్రిగజ్ ఫ్రెయిలె అక్టోబర్ 2020లో 67వేల డాలర్లకు (దాదాపుగా రూ.49 లక్షలు) 10 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్‌ను కొన్నాడు. తరువాత దాన్ని గత వారం కిందట 6.6 మిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.48.3 కోట్లు) విక్రయించాడు. ఆ వీడియో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన భారీ విగ్రహం పడి ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా జనాలు పక్క నుంచే నడిచి వెళ్తుంటారు. దాన్ని పూర్తిగా గ్రాఫిక్స్‌తో క్రియేట్ చేసినట్లు స్పష్టమవుతుంది.
A 10-second video clip sold for $6.6 million: A new type of digital asset known as a non-fungible token (NFT) has exploded in popularity as enthusiasts and investors scramble to spend money on items that only exist online https://t.co/2wrD4iFdkS pic.twitter.com/3St8ERSllo
— Reuters (@Reuters) March 1, 2021
అయితే అలాంటి వీడియోలను నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్‌టీ) డిజిటల్ ఆస్తులుగా పిలుస్తారు. వీటిని బిట్‌కాయిన్ల మాదిరిగా డాలర్లతో కొనవచ్చు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. అందరికీ ఉచితంగా చూసేందుకు అందుబాటులో ఉన్న ఆ క్లిప్‌ను అసలు అతను అంతటి ధర పెట్టి ఎందుకు కొన్నాడో, దాన్ని మళ్లీ ఇంకో వ్యక్తి అంతకన్నా పెద్ద మొత్తం చెల్లించి ఎందుకు కొన్నాడో అంతుబట్టడం లేదు. అయినప్పటికీ మనం ఆ వీడియో క్లిప్‌ను మాత్రం ఉచితంగానే చూడవచ్చు.