కాంగ్రెస్ లో ముదిరిన గ్రూప్ వార్..పార్టీ పొత్తులపై సీనియర్ల ట్విట్ వార్

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ గ్రూప్ వార్ పార్టీని కలవరపెడుతుంది. ఎన్నికల గోదాలో దూకాల్సిన కాంగ్రెస్ పార్టీ, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ప్రధానంగా జీ-23 బృందం.. కాంగ్రెస్‌కు ప్రదాన తలనొప్పిగా మారింది. ఈతరుణంలో బెంగాల్‌ పార్టీ పొత్తుల పై ఆనంద్‌శర్మ అధీర్ రంజన్ చౌదరి మధ్య ట్విట్ వార్ నడుస్తుంది.

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ప్రచారాలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికల్లో భాగంగా ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ నిర్ణయం పార్టీలో మరోసారి విభేదాలకు తెరలేపింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆనంద్‌శర్మ..బెంగాల్‌లో పార్టీ పొత్తును బహిరంగంగా తప్పుబట్టారు. దీంతో పార్టీ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ..ఆనంద్‌ తీరుపై వరుస ట్వీట్లలో మండిపడ్డారు.

బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-వామపక్ష కూటమిలో ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్ధిఖీ నేతృత్వంలోని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ భాగస్వామిగా చేరింది. అయితే ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు, గాంధీ, నెహ్రూలు చెప్పిన లౌకికవాదానికి విరుద్ధమంటూ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన అధిర్‌ రంజన్‌ చౌధురీ వరుస ట్వీట్లలో ఆనంద్‌ శర్మను విమర్శించారు.

ముందు నిజాలు తెలుసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమికి నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్‌ ఇందులో అంతర్భాగంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ విభజన రాజకీయాలను, నియంతృత పాలనను ఓడించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కూటమిలో కాంగ్రెస్‌ సీటు షేరు ఏ మాత్రం తగ్గలేదని…. లెఫ్ట్‌ఫ్రంట్‌ తమ వాటాలోని కొన్ని సీట్లను ఐఎస్‌ఎఫ్‌కు పంచుతోందన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునేవారు కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనాలన్నారు. బీజేపీ ఎజెండాతో… పార్టీని తక్కువ చేసేందుకు ప్రయత్నించకూడదన్నారు. ఇకనైనా ప్రధానమంత్రిని పొగుడుతూ సమయాన్ని వృథా చేసుకోవడం ఆపి.. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా పార్టీకోసం పనిచేయాలని జి23 నేతలకు సూచించారు అదిర్.

కాంగ్రెస్ నుంచి విమర్శలు పెరగడంతో ఆనంద్ శర్మ స్పందించారు.పొత్తుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానన్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కామెంట్స్ చేశానన్నారు. పార్టీలో సమూల సంస్కరణలు రావాల్సిందేనన్నారు ఆనంద్‌శర్మ. ఎన్నికల వేళ పార్టీలో పొత్తులపై రగిలిన రగడ.. ఎన్నికలపైనా ప్రబావం చూపే అవకాశముందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version