అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా కజిరంగ జాతీయ పార్కు తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన జంతువుల్లో ఆరు ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలు (ఇందులో 98 నీట మునిగి ప్రాణాలు కోల్పోగా.. రెండు జింకలు వాహనాలు ఢీకొట్టి చనిపోయాయి. మరో 17 జింకలు చికిత్స సమయంలో ప్రాణాలు కోల్పోయాయి), రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా మొత్తం 131 వన్య ప్రాణాలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని హాగ్ జింకలు, రెండు ఖడ్గమృగాలు, సాంబార్ జింకలు, స్కాప్స్ గుడ్లగూబలు, చిత్తడి జింకలు, కుందేలు, ఒట్టర్, ఏనుగు సహా మొత్తం 97 జంతువులను అధికారులు రక్షించారు. ప్రస్తుతం 25 జంతువులు వైద్య సంరక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 52 జంతువులను చికిత్స తర్వాత సురక్షిత ప్రాంతంలో వదిలినట్లు పేర్కొన్నారు.