ప్రస్తుత కాలంలో ఎన్నో నేరాలు చేసి న్యాయస్థానాన్ని తప్పుదొవ పట్టించి, నిందితులు శిక్షను తప్పించుకొని యథేచ్ఛగా బయట తిరుగుతుంటారు. కొన్ని సార్లు చెయ్యని తప్పుకు కూడా శిక్ష పడి జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అలాంటి ఘటననే ఓ మాజీ ఆర్మీ ఉద్యోగితో జరిగింది. తాను తప్పు చేయకున్నా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతడి శిక్ష పద్నాగేళ్లు పూర్తయి ఇంకా కేవలం 11 రోజుల ఉండగా నిర్ధోషిని తేలిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో సంభవించింది.
అందుకు సంబంధించిన వివరాలు.. మొరెనా జిల్లా భర్రద్‌కు చెందిన బల్వీర్‌సింగ్‌యాదవ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి 2006లో ఓ హత్య కేసులో కొందరు స్నేహితులతో పాటు అతనూ అరెస్టయ్యారు. కోర్టులో కేసుకు సంబంధించిన వాదోపవాదనలు జరిగిన తర్వాత బల్వీర్‌సింగ్ యాదవ్‌కు న్యాయస్థానం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్షకాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యప్రదేశ్‌హైకోర్టు మర్డర్‌కేసులో బల్వీర్‌సింగ్‌ను నిర్దోషిగా తేల్చింది. విడుదలకు 11 రోజుల మందు ఈ తీర్పు రావటం గమనార్హం.
న్యాయస్థానంపై నమ్మకం పెరిగింది..
విడుదల అనంతరం బల్వీర్‌మాట్లాడారు. ‘ నేను చివరిసారిగా సురేంద్ర యాదవ్(హతుడు)ను చూసినందుకు ఈ కేసులో నన్ను నిందితుడిగా చేర్చారు. మధ్యప్రదేశ్‌హైకోర్టు నన్ను ఈ కేసుకు సంబంధం లేదని నిర్ధోషిగా తేల్చినందుకు సంతోషంగా ఉంది. కానీ.. నేను నా ఉద్యోగం, గౌరవం, విలువైన 14 సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నాను. అయిన కూడా న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం పెరిగింది. న్యాయవ్యవస్థ ఏదైనా తీర్పు ఇవ్వటానికి కచ్చితమైన గడువు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకనగా నేను ఎలాంటి తప్పు చేయకున్నా పద్నాగేళ్లు శిక్ష అనుభవించటం చాలా కష్టంగా ఉండింది’ అని బల్వీర్‌సింగ్ యాదవ్ అన్నారు.