యురోపియన్ దేశమైన ఇటలీని కోవిడ్-19 (కరోనా) వైరస్ గడగడ వణికిస్తున్నది. అక్కడి సర్కారు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా వైరస్ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నది. దేశం మొత్తం స్వీయ దిగ్బంధనంలో ఉన్నా కరోనా కేసులు పెరుగుతుండటం ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.
శనివారం ఒక్కరోజే ఇటలీలో 175 మంది కరోనా రోగులు మృతిచెందడంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,411కు చేరింది. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఇటలీలో భారీగానే పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రానికి కేవలం 24 గంటల వ్యవధిలోనే 3500 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కూడా 21,100 దాటింది.
యూరప్‌లోని మిగతా దేశాలతో పోల్చితే ఇటలీలోనే కరోనా విజృంభన ఎక్కువగా కనిపిస్తున్నది. రోగులు, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం గతవారం దేశమంతటా దిగ్బంధనం విధించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో వారం రోజులుగా ఇటలీ ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు.