షాకింగ్‌.. గుండెపోటుతో యాచకుడు మృతి.. అతని గదిలో నోట్ల కట్టలు..

-

ఓ యాచకుడు ఉన్నట్టుండి తన గదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యాచకుడి గదిలో అతడి వివరాల గురించి తనిఖీ చేయగా.. నోట్ల కట్టలు చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కరప మండలం వేళంగిలో రామకృష్ణ అనే సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడు. స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు. సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. నిన్న సదరు యాచకుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాధువు రామకృష్ణ గదిలోకి వెళ్లారు. లోపల రెండు సంచులు నిండుగా కనిపించాయి. వాటిని తెరిచిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వాటినిండా కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. వాటిలో ఎక్కువగా పది రూపాయల నోట్లు ఉన్నట్టు ఎస్సై డి.రమేశ్ బాబు తెలిపారు. ఆ సొమ్ము మొత్తం దాదాపు రూ. 2 లక్షల వరకు స్థానికులు చెబుతున్నారు. చీకటి పడడం, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సొమ్మును నేడు లెక్కించనున్నట్టు తెలిపారు పోలీసులు. పంచాయతీ కార్మికుల సాయంతో రామకృష్ణ మృతదేహాన్ని ఖననం చేసినట్టు చెప్పారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version