గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో 20వేల ఉద్యోగాలు.. ఇంటి నుంచే పని..!

-

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తమ కంపెనీలో కొత్తగా 20వేల మంది ఉద్యోగులను తీసుకోనున్నామని తెలిపింది. అందుకు గాను నోటిఫికేషన్‌ను అమెజాన్‌ విడుదల చేసింది. వీరిని ప్రస్తుతానికి టెంపరరీ ఉద్యోగులుగానే తీసుకుంటామని, కాకపోతే ఈ ఏడాది చివరి వరకు పనితనం చూశాక అవసరం ఉన్నవారిని పర్మినెంట్‌ చేస్తామని అమెజాన్‌ తెలిపింది. కాగా హైదరాబాద్‌తోపాటు పూణె, కోయంబత్తూర్‌, నోయిడా, కోల్‌కతా, జైపూర్‌, చండీగఢ్‌, మంగళూరు, ఇండోర్‌, భోపాల్‌, లక్నోలలో నివాసం ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అమెజాన్‌ తెలిపింది.

అమెజాన్‌లో ఈ ఉద్యోగాల్లో చేరేవారు వర్చువల్‌ కస్టమర్‌ సర్వీస్‌లను అందజేయాల్సి ఉంటుంది. అందుకు గాను అమెజాన్‌ కార్యాలయానికి రావల్సిన పనిలేదు. ఇంట్లో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ఉంటే చాలు. ఇంటి నుంచే పని చేయవచ్చు. ఈ క్రమంలో ఉద్యోగులు అమెజాన్‌ కస్టమర్లతో ఈ-మెయిల్‌, చాట్‌, సోషల్‌ మీడియా లేదా ఫోన్‌ ద్వారా సంభాషణలు జరపాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. ఈ ఉద్యోగాలకు ఇంటర్‌ పాస్‌ అయి ఉంటే చాలు. అలాగే ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు లేదా కన్నడలలో అనర్గళంగా మాట్లాడగలిగే వారు అయి ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు జీతం ఎంత ఇచ్చేది అమెజాన్‌ వెల్లడించలేదు.

ప్రస్తుతం కరోనా కారణంగా చాలా మంది ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, కనుక కస్టమర్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడిందని అమెజాన్‌ తెలిపింది. అందులో భాగంగానే ప్రస్తుతానికి టెంపరరీగా ఉద్యోగులను తీసుకుంటున్నామని తెలిపింది. అయితే చక్కని ప్రదర్శన కనబరిచే వారిని వదులుకోబోమని, వారిని పర్మినెంట్‌ చేస్తామని అమెజాన్‌ తెలియజేసింది. కాగా 2025 వరకు అమెజాన్‌ భారత్‌లో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇది వరకే తెలిపింది. అందులో భాగంగానే ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్తగా ఉద్యోగులను తీసుకుంటోంది.

ఇక ఈ ఏడాది మే నెలలో అమెజాన్‌ 50వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోగా.. ఇప్పుడు తాజాగా మరో 20వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version