భారత్, చైనా సరిహద్దు వివాదంతోపాటు, ఇటు కోవిడ్ 19 విజృంభణ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా దేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీ నేతలందరూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం పాలనలో చైనా ఎంబస్సీ, పలు చైనా కంపెనీలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు విరాళాలు అందజేశాయని బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అయితే కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు బీజేపీకి కూడా సరిగ్గా అదే పరిస్థితి ఎదురవుతోంది.
చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ హువావేతోపాటు టిక్‌టాక్ వంటి పలు కంపెనీలు ఇటీవల భారత ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.30 కోట్ల వరకు విరాళాలు ఇచ్చాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. అలాగే పేటీఎంలో 38 శాతం పెట్టుబడులు పెట్టిన మరో చైనా కంపెనీ కూడా పీఎం కేర్స్‌కు విరాళాలు అందజేసిందని అన్నారు. కాగా హువావేకు చైనాలోని ఆర్మీతోపాటు అక్కడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అనే పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయని, అలాంటి సంస్థ పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేయడం అనుమానాస్పదంగా ఉందని సింఘ్వీ ఆరోపించారు.
అయితే దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని.. ఆ సమావేశాల్లో తాము ఏం అంశం అంటే.. ఆ అంశంపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కౌంటర్ ఇచ్చారు. 1962 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై తాము పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.