హ్యాక్ అయిన‌ 22 కోట్ల పాస్‌వర్డ్స్.. మీ పాస్‌వర్డ్ హ్యాక్ అయిందో లేదో ఇలా చెక్ చేయండి..!

-

పాస్‌వర్డ్‌ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో..మనం అంత అజాగ్రత్తగా ఉంటాము. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే..బ్యాంకింగ్, ఈమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లకు చాలా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. అయితే హ్యాకర్ల చేతిలో దొంగతనానికి గురైన పాస్‌వర్డ్‌లను UKలోని సెక్యురిటీ ఏజెన్సీలు సేకరించాయి. అక్కడి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (NCA), నేషనల్ సైబర్ క్రైమ్ యూనిట్ (NCCU) సహా ఇతర ఏజెన్సీలు దొంగతనానికి గురైన పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్ IDలను తిరిగి పొందాయి.

22.5 కోట్ల పాస్‌వర్డ్‌లను రికవరీ చేశామని, వాటిని ‘హ్యావ్ ఐ బీన్ పాన్డ్’ డేటాబేస్‌కు డొనేట్ చేశామని NCA వెల్లడించింది. ‘Have I Been Pwned’ అనేది ఒక ఫ్రీ సర్వీస్ ప్లాట్‌ఫాం. ఈ ఫ్లాట్ఫాం ద్వారా ఎవరైనా తమ పాస్‌వర్డ్ లేదా ఈమెయిల్ ఐడీ లీక్ అయిందా లేదా అని తనిఖీ చేసుకోవచ్చు. పోలీసుల నుంచి స్వీకరించిన అతిపెద్ద డేటాబేస్ ఇదేనని HIBP పేర్కొంది. ఈ సంస్థ డేటాబేస్‌లో ఇప్పటికే 61.3 కోట్ల స్టోలెన్ పాస్‌వర్డ్‌లు ఉండగా, తాజాగా.. బ్రిటన్ పోలీసులు అందించిన వాటిని వీటికి యాడ్ చేశారు.

లీకైన పాస్‌వర్డ్‌లు సైబర్ నేరగాళ్లకు ఒక ‘నిధి’లా ఉపయోగపడతాయి. బ్యాంకింగ్‌ సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు సంబంధించి మీ పాస్‌వర్డ్ ఎలా ఉంటుందో అంచనా వేయడానికి వారు ఈ పాస్‌వర్డ్‌లను ఉపయెగిస్తారు…ఇందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్స్ సైతం వాడుతారు. ‘Have I Been Pwned’ వెబ్‌సైట్‌ ద్వారా మీ పాస్‌వర్డ్ ఇప్పటికే సైబర్ నేరగాళ్ల డేటాబేస్‌లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. అనంతరం హ్యాకింగ్‌ బారిన పడకముందే వాటిని మనం మార్చుకోవచ్చు.

మీ పాస్‌వర్డ్ దొంగతనానికి గురైందో లేదో ఇలా చెక్ చేయండి..

మీ పాస్‌వర్డ్ లేదా ఈమెయిల్ ఐడీ ఇప్పటికే నేరస్థులకు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ముందు https://haveibeenpwned.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి

మీ ఈమెయిల్ ఐడీ సేఫ్‌గా ఉందో లేదో చెక్ చేయడానికి.. మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసి, ‘pwned?’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఐడీ లీక్ అయితే, దీని గురించి సైట్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

మీ పాస్‌వర్డ్ దొంగతనానికి గురైందో లేదో చెక్ చేయడానికి.. వెబ్‌సైట్ పై భాగంలో ఉన్న ‘Passwords’ ట్యాబ్‌కి వెళ్లండి. అందులో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి చెక్ చేసుకోండి.

డేటా లీక్ అయితే ఏం చేయాలి?
ఒకవేళ మీ వివరాలు లీక్ అయ్యాయని వెబ్‌సైట్‌ ద్వారా మీకు తెలిస్తే, వెంటనే పాత పాస్‌వర్డ్‌ను మార్చండి. మరింత సంక్లిష్టమైన, ట్రేస్ చేయడానికి కష్టమైన వాటిని పాస్‌వర్డ్‌గా ఎంచుకోండి. అయితే ఈ వెబ్‌సైట్ నుంచి మీకు హెచ్చరిక వచ్చినంత మాత్రాన, మీ అకౌంట్‌ హ్యాక్ అయిందనే అర్థంకాదు..మీ ఈమెయిల్ ఐడీ లేదా పాస్‌వర్డ్ ఇప్పటికే సైబర్ నేరగాళ్ల రాడార్‌లో ఉందా లేదా అనే వివరాలను మాత్రమే ఈ వెబ్‌సైట్ తెలియజేస్తుంది. జాగ్రత్తపడి స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ ఐడీ, పాస్‌వర్డ్‌లను చెక్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version