టీమిండియా ఇంగ్లండ్‌తో ఆడుతున్న చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అలెస్టర్ కుక్ రిటైర్ అవుతున్న విషయం విదితమే. అంతకు ముందే కుక్ తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ కుక్‌కు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. కాగా కుక్ ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించాడు. దీంతో అతని టెస్ట్ సెంచరీల సంఖ్య 33కు చేరుకుంది. అయితే ఈ అచీవ్‌మెంట్‌ను పురస్కరించుకుని అలెస్టర్ కుక్‌కు ఇంగ్లండ్ మీడియా ప్రతినిధులు ఊహించని గిఫ్ట్‌ను అతనికి అందజేశారు.
టెస్టులలో 33 సెంచరీలను పూర్తి చేసినందుకు గాను అలెస్టర్ కుక్‌కు ఇంగ్లండ్‌కు చెందిన పలు మీడియా చానళ్లు, పత్రికల ప్రతినిధులు 33 బీర్ బాటిల్స్‌ను అందజేశారు. ప్రెస్ మీట్ జరుగుతుండగా బీర్ బాటిల్స్ ఉన్న ఒక పెట్టెను కుక్‌కు ఓ చానల్ ప్రతినిధి అందజేశాడు. ఒక్కో బీర్ బాటిల్‌పై ఒక్కో జర్నలిస్ట్ ఒక ప్రత్యేకమైన మెసేజ్‌ను కుక్ కోసం రాసినట్టు అతను తెలిపాడు. దీంతో కుక్ మొదట షాకైనా తరువాత.. తనకు ఆ గిఫ్ట్‌ను అందజేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు.
గతంలో ఓసారి కుక్ తాను వైన్ తాగనని, బీర్ మ్యాన్ అని చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు కుక్‌కు గుర్తు చేశారు. అందుకనే కుక్‌కు బీర్ బాటిల్స్‌ను అందజేశామని వారు తెలిపారు. కాగా చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి దిశగా ప్రయాణం చేస్తోంది. 464 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 77 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇప్పటికే 1-3 తేడాతో భారత్ సిరీస్‌ను కోల్పోగా ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.