ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)… ఆరంభంలో ఉన్నంత ఆదరణ ఈ లీగ్‌కు ఇప్పుడు లేదు. అయినప్పటికీ ప్రతి వేసవిలో ఐపీఎల్ చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగానే ఉంటోంది. దీనికి తోడు ఎన్నో సంచలన నిర్ణయాలు, వివాదాలు ఈ టోర్నీ చుట్టూ తిరుగుతుంటాయి. అయినా వీటన్నింటినీ జనాలు పట్టించుకునే స్థితిలో లేరు. మ్యాచ్‌లను చూడడం, ఆనందించడమే ప్రేక్షకులకు కావల్సింది. అయితే ప్రతి ఏటా ఐపీఎల్ భారత్‌లోనూ జరుగుతోంది. కానీ ఈ సారి మాత్రం భారత్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.
2019 వేసవిలో పార్లమెంట్ ఎన్నికలు, పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని కారణంగానే ఈ సారి ఐపీఎల్ భారత్‌లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో ఓ సారి ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు సౌతాఫ్రికాలో ఐపీఎల్‌ను నిర్వహించారు. అయితే ఈ సారి సౌతాఫ్రికాతోపాటు ఇంగ్లండ్, యూఏఈలను కూడా బీసీసీఐ పరిశీలిస్తోంది.
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లేదా యూఏఈలలో ఏదో ఒక వేదికలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక, షెడ్యూల్‌ను బట్టి కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.