బీహార్‌లోని బక్సర్‌లో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌లో ఓ వ్యక్తి నిత్యం 40 రొట్టెలు, 10 ప్లేట్ల అన్నం తింటుండడం ఆ సెంటర్ అధికారులను ఆందోళనకు గురి చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి బీహార్‌కు ప్రస్తుతం పెద్ద ఎత్తున వలసకార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. అయితే కార్మికులను 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్‌లలో ఉంచాకే.. వారిని సొంత ఊళ్లకు వెళ్లేందుకు బీహార్ ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ క్రమంలోనే సదరు క్వారంటైన్ సెంటర్‌లో ఓ వలస కార్మికుడు నిత్యం అంత పెద్ద మొత్తంలో ఆహారం తింటుండడం.. అటు అధికారులనే కాదు, తోటి కార్మికులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.
బీహార్‌లోని ఖార్హా తండా పంచాయతీకి చెందిన 23 ఏళ్ల అనూప్ ఓఝా అనే వలస కార్మికుడు రాజస్థాన్‌కు వలస వెళ్లి అక్కడే పనిచేస్తుండేవాడు. గత 10 రోజుల కిందట అక్కడి నుంచి బీహార్‌కు వచ్చాడు. దీంతో అతన్ని బక్సర్ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. అయితే నిత్యం అతను ఆ సెంటర్‌లో 40 రొట్టెలు, 10 ప్లేట్ల అన్నంతోపాటు స్థానిక వంటకమైన లిట్టీలను కూడా నిత్యం పెద్ద మొత్తంలో ఆరగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి బ్లాక్ అధికారులు ఈ విషయమై విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం అతని క్వారంటైన్ గడువు ముగియడంతో అతన్ని సొంత ఊరికి పంపించేశారు.
ఇక మనుషుల్లో ఒత్తిడి స్థాయిలు అధికమైనప్పుడు శరీరంలో ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసోల్ అనబడే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది మనకు విపరీతమైన ఆకలిని కలగజేస్తుంది. అందుకనే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఇక ఆ ఒత్తిడి స్థాయిలు ఒకానొక దశలో తగ్గుతాయి. కానీ కొందరికి అవి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. దీంతో వారు నిత్యం అధికంగా ఆహారం తీసుకుంటారు. ప్రస్తుతం ఆ వ్యక్తి విషయంలోనూ జరిగిందిదే. అందుకనే అతను అతిగా ఆహారం తిని ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు.