Telangana : రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 427 స్పౌజ్‌ బదిలీలు

-

గణతంత్ర దినోత్సవవేళ తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్​లో ఉన్న స్పౌజ్ బదిలీలపై క్లారిటీ ఇచ్చింది. స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగనున్నాయి. ప్రభుత్వం 13 జిల్లాల్లో 615 మంది బదిలీలకు అనుమతి ఇవ్వగా.. అందులో 427 మంది ఉపాధ్యాయులు 12 జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల స్పౌజ్‌ ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద మౌనదీక్ష చేసిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

గతేడాది 317 జీవో అమలు చేసిన సమయంలో 19 జిల్లాల్లో సుమారు రెండు వేల స్పౌజ్‌ బదిలీలు చేశారు. మిగిలిన 13 జిల్లాల్లో బదిలీలను చేపట్టలేదు. అందులో సిద్దిపేట, మేడ్చల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, హనుమకొండ, రంగారెడ్డి, వరంగల్‌, సూర్యాపేట, మంచిర్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలున్నాయి. ఈ జిల్లాలకు వచ్చేందుకు 2,100 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

తాజాగా 615 బదిలీలకు అనుమతి ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. సూర్యాపేట జిల్లాలో ఆ పోస్టులు ఖాళీలు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఎస్‌జీటీలకు అవకాశం ఇస్తారని, అందుకు కొంతసమయం పట్టవచ్చంటున్నారు.  అందువల్లే ఈ జిల్లాకు మినహాయింపు ఇచ్చారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version