లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. సారన్ జిల్లాలోని ఛప్రాలో కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.
కల్తీ మద్యం సేవించి బిహార్లోని ఛప్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. పట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.
కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో 25 మంది కంటిచూపు కోల్పోయారని గ్రామస్థులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో మరికొందరు బాధపడుతున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు దేశీ మద్యాన్ని సేవించారని గ్రామస్థులు వెల్లడించారు. మరోవైపు మద్యనిషేధానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని.. తమ కుటుంబాలు రోడ్డున పడుతూనే ఉన్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన బృందాన్ని గ్రామానికి పంపినట్లు సారన్ జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు.