ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడు పాయల టెంపుల్ గత 8 రోజులుగా నీటిలో మునిగి ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మెదక్ జిల్లాలోని ఈ ఆలయం వద్ద గత 8 రోజులుగా ప్రమాదకర స్థాయిలో మంజీరా ప్రవహిస్తోంది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా ప్రవాహం కొనసాగుతోంది. అయితే, భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ నెలలో 17 రోజుల పాటు ఏడుపాయల ఆలయం మూతపడిన విషయం తెలిసిందే.
అదేవిధంగా గత 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం ఉంది. ఈ క్రమంలోనే అర్చకులు ఆలయంలోకి వెళ్లకుండా కేవలం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.వరద తగ్గాక అమ్మవారిని దర్శించుకుంటామని ఆలయ ఈవో తెలిపారు.సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.