దేశంలో 90 శాతం మంది ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8.3 కోట్ల మరుగుదొడ్లను కట్టించామని మోడీ అన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 40 శాతం మందికి మాత్రమే టాయిలెట్లు ఉండేవని కానీ దాన్ని తమ హయాంలో 90 శాతానికి పెంచామని మోడీ తెలిపారు. ఇక దేశంలో ఉన్న 19 రాష్ట్రాల్లోని 2800 టౌన్లు, 430 జిల్లాలు, 4.15 లక్షల గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మారాయని అన్నారు. ఈ మేరకు మోడీ ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
2014లో ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగా స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తుందని మోడీ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడం వల్ల 3 లక్షల మందికి పైగా చిన్నారుల జీవితాలను కాపాడగలిగామన్నారు.
ఈ నెల 15వ తేదీన ఉదయం 9.30 గంటలకు స్వచ్ఛతా హై సేవా మూవ్‌మెంట్ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అదే రోజుకు స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తవుతుందని మోడీ అన్నారు. పరిశుభ్రమైన స్వచ్ఛ భారత్‌ను నిర్మింపజేయాలనే బాపూజీ కలను నెరవేర్చడంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేయాలని మోడీ పిలుపునిచ్చారు.