47 ఏళ్ల వయసులో 30 కి.మీ ఈతకొట్టిన హైదరాబాద్ మహిళ

-

మనిషికి కృషి పట్టుదల ఉంటె ఏదైనా సాధించవచ్చు అని మరోసారి నిరూపించింది ఓ మహిళ. 47వయస్సులో శ్రీలంక తీరం నుంచి ధనుష్కోడికి 30 కి.మీ ఈతకొట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ నారీమణి. ఇక సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది హైద్రాబాద్ కి చెందిన ఓ మహిళ. హైదరాబాద్‌కు చెందిన శ్యామల ఒక వ్యవస్థాపకురాలు. ఈ సముద్ర ఈత కోసం ఆమెకు సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ త్రివేది శిక్షణ ఇవ్వడమేకాదు, మార్గనిర్దేశం కూడా చేశారు.

shyamala

30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు. సముద్రంలో ఇంత దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు, ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు. శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టిన తరువాత రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్‌ లిఫ్టర్‌. తాను క్రీడారంగంలో ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం వాటికి దూరంగా ఉంచాలని ఆయన భావించారు. శ్యామలను ఐఏఎస్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చదువుపై అంతగా ఆసక్తిలేని శ్యామల.. చిత్రకళపై దృష్టిసారించి యానిమేటర్‌ అయ్యారు. మా జూనియర్స్‌ చానల్‌లో యానిమేషన్‌ సిరీస్‌ చేశారు. లిటిల్‌ డ్రాగన్‌ అనే యానిమేషన్‌ సినిమా కూడా తీశారు.

syamala

అయితే, ఆ సినిమాతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో యానిమేషన్‌కు విరామిచ్చారు. అనంతరం 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌ నేర్చుకుని మరో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. గతంలో హుగ్లీలో 14 కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌ జలసంధిని విజయవంతంగా అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version