రేవంత్ రెడ్డి సర్కారుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. వేలాది మంది ఒకేసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తమ నివాసాలను కూలుస్తోందని, పునరావాసం కల్పించకుండా తాము ఉంటున్న నిర్మాణాలను ఒక్కసారిగా కూల్చివేస్తే తామంతా ఎక్కడికి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.
అయితే, ప్రభుత్వం మాత్రం మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, మూసీ సుందరీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని.. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేయడానికి వచ్చిన వారికి రూ.25వేలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నటివరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను బుల్డోజర్‌లతో కూల్చివేయించిన ప్రభుత్వం మూసీ నిర్వాసిత ఇళ్లను మాత్రం కూలీలను పెట్టించి కూలగొట్టిస్తోంది.