ఏపీలోని అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచార జరిగింది. అయితే, ఆ బాలిక జి.మాడుగులకు చెందిన గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 25న బాలిక అదృశ్యమవ్వగా.. తల్లిదండ్రులు ఈ నెల 28న పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు సాయంత్రం పాడేరులో బాలికను గుర్తించారు. మల్లీశ్వరరావు, సన్యాసిరావు అనే ఇద్దరు వ్యక్తులు తనను స్కూలు నుంచి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. ఈ మేరకు పోలీసులు నిందితులు ఇద్దరి మీద పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికపై లైంగికదాడి గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.