వినాయకుడి మెడలో రూ.4 లక్షల బంగారు గొలుసు.. అలాగే నిమజ్జనం!

-

వినాయక చవితి సందర్భంగా ఓ జంట చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంట్లో గణపతికి పూజ చేసిన దంపతులు విగ్రహం మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసును వేశారు. అనంతరం ఆ గొలుసును మరిచిపోయి, తీయకుండానే నిమజ్జనం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. చవితి పండుగను ఇంట్లో ఘనంగా చేసుకున్న రామయ్య-ఉమాదేవి దంపతులు విగ్రహం మెడలో ఖరీదైన బంగారు గొలుసును వేశారు.
ఆ తర్వాత పూల దండలు, పత్రులతో అలంకరించారు.

అయితే, పూల దండలు, పత్రుల అడ్డుగా ఉండటంతో గొలుసు వారికి కనిపించలేదు. గొలుసు వేశామని కూడా వారు మర్చిపోయారు. అనంతరం ఓ మొబైల్ ట్యాంకులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేసి ఇంటికొచ్చారు. ఆ తర్వాత వారికి గొలుసు గుర్తుకొచ్చింది.వెంటనే ఆగమేఘాలపై నిమజ్జనం చేసిన మొబైల్ ట్యాంకు వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో విషయం చెప్పగా.. ఆ టైంలో అక్కడున్న ఓ కుర్రాడు విగ్రహం మెడలో గొలుసు చూశానని, కాకపోతే అది నకిలీది అనుకున్నానని చెప్పాడు. చివరకు ఆ జంట పోలీసులు, ఎమ్మెల్యే ప్రియకృష్ణకు విషయం చెప్పగా..ఆ గొలుసును వెతికి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు.మొత్తం 10 మంది మొబైల్ ట్యాంకులోకి దిగి వెతకగా చైన్ దొరకడంతో ఆ జంట ఊపిరిపీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version